: భారత్ తో సమస్యలున్న మాట వాస్తవమే, అయినా ముందడుగు వేస్తాం!: మోదీతో భేటీ సందర్భంగా చైనా ప్రధాని
చైనా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీతో చైనా ప్రధాని లీ కెషాంగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 10 బిలియన్ డాలర్ల విలువైన 24 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అనంతరం చైనా ప్రధాని మాట్లాడుతూ, భారత్, చైనాలు రెండూ ఆసియా ఖండానికి రెండు ఇంజిన్లుగా పనిచేస్తాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుని, ఆధునికత వైపు అడుగులు వేస్తే... రాబోయే రోజుల్లో ఆసియా అత్యున్నత శక్తిగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య నిరంతరాయంగా చర్చలు కొనసాగాలని, నమ్మకాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఎదగాలని తెలిపారు. భారత్, చైనాల మధ్య జరుగుతున్న వ్యాపార లావాదేవీలు భారీ స్థాయిలో లేవని... రెండు దేశాల మధ్య వాణిజ్యం సమాన స్థాయిలో జరగాలని కోరారు. ఇరు దేశాల మధ్య సమస్యలు ఉన్నాయని... అయితే, వాటన్నింటినీ పరిష్కరించుకొని, ముందడుగు వేస్తామని చైనా ప్రధాని తెలిపారు. సరిహద్దుకు సంబంధించిన చర్చలు కొనసాగాలని అభిప్రాయపడ్డారు. బోర్డర్ వద్ద శాంతి నెలకొనే చర్యలను ఇరు దేశాలు చేపట్టాలని చెప్పారు.