: అయినా... ఇదేం వెర్రి బాబోయ్!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడం తెలిసిందే. వ్యక్తిగతంగా జయకు ఈ తీర్పు ఎంతో ఊరట కలిగించింది. అటు, పార్టీ శ్రేణుల ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు చాలవన్నట్టు తమిళనాట సంబరాలు జరిగాయి. 'అమ్మ' అని పిలుచుకునే తమ అధినేత్రిని కోర్టు నిర్దోషిగా పేర్కొనడంతో అన్నా డీఎంకే కార్యకర్తలు తమ ఆరాధనను ఏ రీతిలో చాటుకుంటున్నారో చూడండి. తాజాగా, కోయంబత్తూరులోని చంద్రన్ అనే వార్డు కౌన్సిలర్ నగరంలో ఓ కార్యకర్త కుమారుడికి స్వయంగా నామకరణం చేశారు. ఎవరి పేరు పెట్టారో తెలిస్తే 'ఇదేం వెర్రి బాబోయ్' అనక మానరు. జయను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించిన కర్ణాటక హైకోర్టు జడ్జి సీఆర్ కుమారస్వామి పేరును ఆ మగశిశువుకు పెట్టారు. విజయ్ కుమార్ అనే పార్టీ కార్యకర్తకు అబ్బాయి పుట్టడంతో అతడి ఇంటికి వెళ్లిన చంద్రన్ ఆ బాబుకు పేరు పెట్టడమే కాకుండా, ఓ బంగారు ఉంగరాన్ని గిఫ్టుగా ఇవ్వడం విశేషం. దీని గురించి చంద్రన్ మాట్లాడుతూ... "ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కేసులో మంచి తీర్పు ఇచ్చిన జస్టిస్ కుమారస్వామికి మా కృతజ్ఞతలు తెలుపుకునే క్రమంలో మా వంతుగా ఇలా చేశాం. అయినా ఇది చిన్నదే" అని తెలిపారు. ఇక, కార్యకర్త విజయకుమార్ దంపతులు జయ కేసులో నిర్దోషిగా బయటపడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తొలుత తాము బిడ్డకు దేవుడి పేరు పెట్టాలని భావించినా, చంద్రన్ విజ్ఞప్తితో మనసు మార్చుకున్నామని వివరించారు. ఇక, చంద్రన్ ఇతర అన్నా డీఎంకే కార్యకర్తలకు ఎలాంటి పిలుపునిచ్చారో చూడండి. మగ శిశువు పుడితే 'కుమారస్వామి' అని, అమ్మాయి పుడితే 'అమ్మ కుమారస్వామి' అని పేరు పెట్టుకోవాలని సూచించారు.