: ఆటవిక న్యాయం అమలు చేసిన గ్రామస్థులు
బీహార్ లో పంచాయతీల దారుణాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా ఈ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ దారుణం అక్కడ నెలకొన్న ఆటవిక న్యాయాన్ని కళ్లకు కడుతోంది. గయకు సమీపంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... పెళ్లయి ముగ్గురు పిల్లలున్న ఓ వ్యక్తి తన అత్తవారి ఇంటికి తరచూ వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అత్తగారి గ్రామంలోని ఓ 16 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం హద్దులు దాటడంతో మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో వారి కోసం వెతికిన బంధువులు ఎట్టకేలకు వారిని పట్టుకుని పంచాయతీకి ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఏర్పాటు చేసిన పెద్దలు, వారికి సజీవ దహనం శిక్ష విధించారు. దీంతో పంచాయతీ పెద్దలు, బంధువులు, కన్నవారి సమక్షంలో వారిద్దరినీ విచక్షణా రహితంగా కొట్టి, సజీవ దహనం చేసేశారు. ఇంత దారుణం జరుగుతున్నా గ్రామంలో ఒక్కరు కూడా పోలీసులకు సమాచారమందించకపోవడం విశేషం. పక్కగ్రామంలోని వ్యక్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 20 మంది అనుమానితులను గుర్తించారు. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. సమాజంలో ఆటవికన్యాయం అమలు చేయడంపై హక్కుల సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.