: ఇక 108 వంతు... తెలంగాణలో నిలిచిన ‘సంజీవని’ సేవలు
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ముగిసింది. తెలంగాణలో 108 సేవల కార్మికుల సమ్మె మొదలైంది. సేవల మెరుగుదల, కనీస వేతనాలు తదితర డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే 108 సిబ్బంది ప్రభుత్వానికి సమ్మె నోటీసు జారీ చేశారు. అయితే సమ్మె నోటీసు తమకేమీ అందలేదని చెబుతున్న సర్కారు సమ్మెను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల వేతనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచిన ప్రభుత్వం 108 సేవల దగ్గరికొచ్చేసరికి ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదని ఈ సందర్భంగా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక సర్కారీ ఉద్యోగుల మాదిరిగా వేతన సవరణ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంబులెన్స్ ల నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపట్టాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.