: ఉపాసన పెట్టుబడి... రామ్ చరణ్ ప్రచారం
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఫిట్ నెస్ వ్యాపారంలో ప్రవేశించాడు. ఇప్పటికే పోలో టీమ్ (ఆర్సీ హెచ్ఆర్పీసీ)ను కొనుగోలు చేసి క్రీడల్లోనూ అభిరుచి ప్రదర్శించిన చెర్రీ, 'టర్బో మేఘా' ద్వారా విమానయాన రంగంలోనూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉరకలు వేస్తున్నాడు. తాజాగా, ఫిట్ నెస్ వ్యాపారంలో ఉన్న వొలనో ఎంటర్ టైన్ మెంట్ లో ఆయన భార్య, అపోలో లైఫ్ టైమ్ వెల్ నెస్ ఎండీ ఉపాసన పెట్టుబడి పెట్టారు. అవరోధాలను అధిగమిస్తూ సాగే క్రీడగా పేరుగాంచిన డెవిల్స్ సర్క్యూట్ ను వొలనో నిర్వహిస్తోంది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో సామర్ధ్యాలను పెంచే కొత్త క్రీడలను కనిపెట్టడమే ప్రధాన లక్ష్యంగా వొలనో సాగుతోంది. ఈ కంపెనీలో తన భార్య పెట్టుబడులు పెట్టగా, స్వయంగా రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారి సదరు సంస్థకు ప్రచారం చేయనున్నాడట. ఈ మేరకు నిన్న హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశానికి రామ్ చరణ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు స్పోర్టింగ్ ఈవెంట్లు, జిమ్ కు వెళ్లినప్పుడల్లా కొత్త జోష్ వస్తుందని తెలిపాడు.