: భూమిలో పాతిపెట్టినా బతికిన చిన్నారి!
గ్రహణం మొర్రి కొడుకుని వదిలించుకోవాలని ఆ తల్లిదండ్రులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. చైనాలో చోటుచేసుకున్న ఈ దారుణంలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... చైనాలోని దక్షిణ ప్రావిన్స్ లో గల గువాంగ్జీ ప్రాంతంలో గ్రహణం మొర్రితో పుట్టిన ఓ చిన్నారిని తల్లిదండ్రులు చిన్న చెక్కపెట్టెలో పెట్టి భూమిలో పాతిపెట్టేశారు. ఆ పెట్టె చుట్టూ గడ్డి, ఇతర మొక్కలు అమర్చారు. ఇవే ఆ బాలుడిని కాపాడాయి. బాలుడున్న పెట్టెలోకి గాలి, తడి వెళ్లి బాలుడి ప్రాణాలకు రక్షణగా పని చేశాయి. అటుగా వనమూలికల కోసం వెళ్లిన ఓ మహిళ బాలుడి ఏడుపు విని పోలీసులకు ఫోన్ చేయడంతో వారు రంగ ప్రవేశం చేసి, పెట్టెలోని బాలుడ్ని రక్షించి, ఆసుపత్రిలో చేర్చారు. బాలుడి నోరు, ముక్కులోకి మట్టి చేరినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులను, వారికి సహకరించిన ముగ్గురు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలుడ్ని పాతిపెట్టి 8 రోజులు గడిచినట్టు వారు తెలిపారు. అంగవైకల్యంతో జన్మించిన పిల్లలను పెంచడం, వారికి వైద్య సౌకర్యాలు అందజేయడం ఆర్థిక భారంగా మారడంతో, తల్లిదండ్రులే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చైనా పోలీసులు తెలిపారు.