: 'భారత న్యాయ వ్యవస్థకు ఏడు చెడ్డ రోజులు' అంటున్న బీబీసీ!


వారంతా ప్రముఖులే. తమతమ నేర పూరిత చర్యలతో కింది కోర్టుల్లో జైలు శిక్ష పడ్డవారే. ఒకరు ప్రముఖ హీరో, మరొకరు ఒకప్పటి బడా పారిశ్రామికవేత్త, ఇంకొకరు దేశ రాజకీయాలను శాసించే సత్తా ఉన్న మహిళా నేత. వీరంతా వారం రోజుల వ్యవధిలో శిక్ష అమలుపై స్టే తెచ్చుకున్నవారే. వీరి నేరాలు, జరుగుతున్న విచారణ, పడే శిక్షలపై ప్రపంచమంతా ఆసక్తిని చూపింది. చట్టం ముందు ఎంతటివారైనా సమానమేనని ఆనందిస్తున్న వేళ, వేర్వేరు కోర్టులు వీరి శిక్షలను సస్పెండ్ చేస్తూ తీర్పిచ్చాయి. వారే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత, సత్యం రామలింగరాజులు. వారం వ్యవధిలో వీరికీ ఊరట కలిగించే తీర్పులు వెలువడ్డాయి. ఈ వారం రోజులు భారత న్యాయ వ్యవస్థకు చెడ్డ రోజులని బీబీసీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసు విషయంలో 13 సంవత్సరాల పాటు విచారణ జరిపిన కోర్టు 5 ఏళ్ల జైలుశిక్ష విధిస్తే రెండే రోజుల్లో దేశంలోని అత్యంత ప్రముఖ న్యాయవాదులు రంగంలోకి దిగి శిక్షపై సస్పెన్షన్ తెచ్చుకున్నారని ప్రస్తావించింది. ఇక ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో 18 సంవత్సరాల విచారణ అనంతరం శిక్ష పడ్డా, తన పలుకుబడితో బెయిలుపై ఉన్న జయలలిత ఆ శిక్షపై సస్పెన్షన్ తెచ్చుకోవడంలో సఫలీకృతమయ్యారు. మరో కేసులో అతిపెద్ద కార్పొరేట్ స్కాంలలో ఒకటిగా నిలిచిన సత్యం కంప్యూటర్స్ కేసులో, జైలు శిక్ష అనుభవిస్తూ కూడా, రామలింగరాజు తదితరులు బెయిలు తెచ్చుకోగలిగారు. ఆయన శిక్ష కూడా ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉంది. వీరితో పోలిస్తే ఎంతో తక్కువ తీవ్రత ఉన్న నేరం చేసినవాళ్లు వేలాది మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. వీరిలో అత్యధికులు బెయిలు లభించినా కూడా, అందుకోసం చెల్లించాల్సిన రూ. 5 వేలు, రూ. 10 వేల బాండ్లను చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఇండియాలో నీతిమంతులైన న్యాయమూర్తులు ఉన్నప్పటికీ, రాజకీయ ప్రలోభాలు, డబ్బుకు లొంగే న్యాయమూర్తులు ఇంకో కోర్టులో ఉండడం పలువురు అవినీతి పరులకు లాభిస్తోందన్నది హార్వార్డ్ లా స్కూల్ లో చదువుతూ, భారత న్యాయ వ్యవస్థపై రీసెర్చ్ చేస్తున్న నిక్ రాబిన్సన్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News