: మరింత ప్రియం కానున్న ఎంట్రీ లెవల్ కార్లు!
అన్ని రకాల కార్లలో భద్రతా పరమైన అంశాలకు పెద్ద పీట వేయాలని, ఎయిర్ బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ తప్పనిసరి చేయడంతో పాటు క్రాష్ టెస్టు తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధనలను అమలు చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేయడంతో కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. వచ్చే రెండేళ్లలో ఎంట్రీ లెవల్ కార్ల ధరలు 10 శాతానికి పైగా పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముందువైపు నుంచి 56 కి.మీ వేగంతో, ఇరు పక్కలా 50 కి.మీ వేగంతో వచ్చే వాహనాలు ఢీకొట్టినా కారులోని వారికి ప్రాణాపాయం జరగకూడదన్న నిబంధనలు పాటించేలా వాహనాలు తయారు చేయాలంటే అదనంగా 30 వేల రూపాయల వరకూ భారం పడుతుందని తెలుస్తోంది. రూ. 3 నుంచి 5 లక్షల లోపు కార్లలో ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ అమర్చాలంటే కార్ల తయారీ సంస్థలు 10 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి వుంటుందని, ఆ భారం కస్టమర్లపై పడుతుందని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. ఎంట్రీ లెవల్ కార్ల బేస్ మోడల్ ను సైతం మార్చాల్సి వుంటుందని, సెడాన్ లపై మాత్రం పెద్దగా భారం పడబోదని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్) డైరెక్టర్ జనరల్ విష్ణు మాధుర్ అభిప్రాయపడ్డారు. సెడాన్, యస్ యూవీ మోడల్ వాహనాలు ఇప్పటికే ఈ నిబంధనలను పాటిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.