: టయోటా, నిస్సాన్ కార్లలో ఎయిర్ బ్యాగ్ లోపాలు... 65 లక్షల కార్లు రీకాల్
ప్రపంచ ఆటో ఇండస్ట్రీలో అతిపెద్ద 'రీకాల్'కు టయోటా, నిస్సాన్ లు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈ కంపెనీలు తయారుచేసి విక్రయించిన కార్లలో ఎయిర్ బ్యాగ్స్ అమరికలో లోపాలున్నాయని నిపుణులు నివేదిక ఇవ్వడంతో కార్లను రీకాల్ చేయాలని (వెనక్కి తీసుకోవాలని) సంస్థలు నిర్ణయించాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ సరైన సమయంలో తెరచుకోని కారణంగా ఐదుగురు మృత్యువాత పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 2003 నుంచి నవంబర్ 2007 మధ్యకాలంలో తయారు చేసిన 35 రకాల మోడళ్లకు చెందిన 50 లక్షలకు పైగా వాహనాలను రీకాల్ చేసినట్టు టయోటా వెల్లడించగా, 2004 నుంచి 2008 మధ్య విక్రయించిన 15.6 లక్షల కార్లను రీకాల్ చేసినట్టు నిస్సాన్ ప్రకటించింది. కార్ల యజమానులకు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్టు రెండు కంపెనీలు వెల్లడించాయి. తకాటా సంస్థ తయారు చేసిన ఎయిర్ బ్యాగ్స్ వాడిన అన్ని కార్లనూ రీకాల్ చేస్తున్నట్టు తెలిపాయి.