: బ్యాంకుల ఉచ్చులతో మీ పర్సుకు చిల్లుపడే ప్రమాదం... ముందే తెలుసుకుంటే మంచిది!
సొంతింటి కలను నిజం చేసుకోవాలన్న తొందర్లోనో లేదా వాహన కొనుగోలు వంటి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రుణం తీసుకునే సమయంలోనో బ్యాంకులకు దరఖాస్తు చేసినప్పుడు పదులకొద్దీ సంతకాలు పెట్టాల్సి వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమయంలో బ్యాంకులు నియమ నిబంధనల పేరిట చాంతాడంత రాసిన కాగితాలపై, అంగీకారం తీసుకుంటూ సంతకాలు పెట్టించుకుంటాయి. కళ్ల ముందు కనిపించే సొంతిల్లు, లేదా చెక్కు కోసం ఎదురుచూస్తూ, ఈ నియమాల గురించి పెద్దగా పట్టించుకోకుండా సంతకాలు పెట్టడం వల్ల పర్సులకు చిల్లు పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఓ గంట సమయం కేటాయించి, కొన్ని విషయాలు ముందే తెలుసుకొని వాటిపై బ్యాంకు అధికారుల వివరణ కోరి, ఆ తరువాతనే ముందడుగు వేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. గృహ రుణం తీసుకునేటప్పుడు బ్యాంకులు ఆస్తి బీమాను అంటగడతాయి. దీంతో పాటు తాకట్టులో ఉన్న ఆస్తి రక్షణకు టర్మ్ బీమాను తీసుకోవాలని సూచిస్తాయి. దురదృష్టవశాత్తు ఇంటి యజమాని మరణించినా, బ్యాంకుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ బీమా పాలసీలు ఉపకరిస్తాయని చెబుతాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, హౌసింగ్ సొసైటీ ద్వారా లేక అపార్ట్ మెంట్ లో ఇల్లు కొనుగోలు చేస్తుంటే, సదరు సొసైటీ లేదా బిల్డర్ ఇప్పటికే బీమా చేయించి ఉంటాడు కాబట్టి, మీరు విడిగా బీమా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పనిసరైతే ఆ ప్రీమియం గృహ రుణంలో కలవకుండా చూసుకుంటే, అధిక వడ్డీ భారం తప్పుతుంది. బ్యాంకులు వేసే మరో ఉచ్చు క్రెడిట్ కార్డుల జారీ... తొలి సంవత్సరం పాటు ఎటువంటి చార్జీలు చెల్లించకుండా కార్డులు ఇస్తామని వల వేస్తుంటాయి. వద్దనుకుంటే రెండో సంవత్సరం నుంచి కార్డును రద్దు చేసుకోవచ్చని నమ్మబలుకుతాయి. కార్డు గడువు ముగిసే సమయంలో ఒక మెయిలు పంపి మీరు వద్దనలేదు కాబట్టి, ఇంత ఫీజుతో కార్డును కొనసాగిస్తున్నట్టు తెలుపుతాయి. ఏదైనా వివాదం తలెత్తితే మీ సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బును క్రెడిట్ కార్డుకు బదలాయింపు చేస్తాయి. క్రెడిట్ కార్డుల విషయంలో ఆర్బీఐ అమలు చేస్తున్న నిబంధనలు ఖాతాదారులకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాలు ఒక్కసారి చదువుకుంటే జేబుకు చిల్లు పడకుండా చూసుకోవచ్చు. ఏదైనా ఫిక్సెడ్ డిపాజిట్ చేసినప్పుడు కాలపరిమితి తీరిన తరువాత 'ఆటో రెన్యువల్' ఆప్షన్ ను ఎంచుకుంటే మంచిది. ఆటో రెన్యువల్ ఆప్షన్ తీసుకున్న వారు, ఒకసారి రెన్యువల్ తరువాత ముందస్తు విత్ డ్రా తీసుకుంటే ఎటువంటి ఫైన్ పడదు. ఆ ఆప్షన్ ఎంచుకోకుంటే, కాలపరిమితి ముగిసిన తరువాత 7 నుంచి 9 శాతం వడ్డీ లభించే ఎఫ్ డీల్లోని నగదును బ్యాంకులు 4 శాతం వడ్డీ వచ్చే సేవింగ్స్ ఖాతాల్లోకి మళ్లిస్తాయి. ఈ విషయంపై ముందస్తు సమాచారం కూడా ఇవ్వవు. ముందే ఆటో రెన్యువల్ కు అంగీకరిస్తే కాలపరిమితి ముగిసిన ఎఫ్ డీలపై కొంతయినా అదనపు మొత్తం పొందవచ్చు. వ్యక్తిగత రుణాలను ముందస్తుగా చెల్లించాలని భావిస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, వడ్డీ రేట్లు పాలసీలకు అనుగుణంగా మారేటట్లయితే, ముందస్తు చెల్లింపులపై జరిమానాలు ఉండవు. అదే ఫిక్సెడ్ వడ్డీ రేటున్న రుణాలైతే, వివిధ బ్యాంకులు 5 నుంచి 10 శాతం వరకూ జరిమానాలు విధిస్తుంటాయి. ముందస్తు చెల్లింపు కాలపరిమితిపై ఉన్న డెడ్ లైన్ దాటేవరకూ వేచిచూస్తేనే మంచిది. రుణం తీసుకున్న తరువాత ఆరునుంచి 12 నెలల కాలం పాటు బ్యాంకులు ముందస్తు చెల్లింపు డెడ్ లైన్లను విధిస్తుంటాయి. వీటిపై సమాచారం ముందుగానే ఆకళింపు చేసుకోవాలి. ఇక బ్యాంకుల ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వస్తే, రుణ మొత్తంపై ఒక శాతం వరకూ వసూలు చేస్తుంటాయి. తీసుకోవాలనుకున్న రుణం ఎక్కువగా ఉంటే, బ్యాంకు అధికారులతో బేరం ఆడటం ద్వారా కొన్ని వేల రూపాయలను మిగుల్చుకోవచ్చు.