: రక్షణ మంత్రిని బహిరంగంగా కాల్చిచంపించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు
దేశద్రోహం, అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై, ఉత్తర కొరియా రక్షణ మంత్రి హ్యోన్ యోంగ్ చౌల్ ను విమాన విధ్వంసక గన్స్ తో కాల్చి చంపారు. తన తండ్రి మరణంతో 2011లో నార్త్ కొరియా అధ్యక్ష బాధ్యతలను కిమ్ జాంగ్ ఉన్ స్వీకరించిన తరువాత పలువురు ఉన్నతాధికారులకు మరణదండన శిక్షలు అమలైన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం వందలాది మంది ప్రజలు చూస్తుండగా, అత్యంత కిరాతకంగా యోంగ్ చౌల్ కు శిక్షను అమలు చేసినట్టు సౌత్ కొరియా మీడియా వర్గాలు వెల్లడించాయి. గడచిన ఏప్రిల్ లో మాస్కోలో జరిగిన ఓ భద్రతా సదస్సుకు హాజరైన హ్యోన్, తన అధీనంలోని సైన్యాన్ని ప్రోత్సహించి కిమ్ జాంగ్ కు సరైన గౌరవం ఇవ్వకుండా, అమర్యాదపూర్వకంగా ప్రవర్తించాడన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. తన అధికారాలను ప్రశ్నిస్తున్న 15 మంది సీనియర్ ఉద్యోగులను చంపివేయాలని కిమ్ ఆదేశాలు జారీ చేశారని సౌత్ కొరియన్ గూఢచార సంస్థ ఒకటి ఏప్రిల్ నెలాఖరులో వెల్లడించింది. ఉత్తర కొరియాలోని పై, మధ్య స్థాయి నేతలు కిమ్ జాంగ్ కు ఎంతమాత్రమూ గౌరవం ఇచ్చేందుకు సుముఖంగా లేరని, దేశంలో అంతర్గత రాజకీయాలు తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి కిమ్ పదవికి ప్రమాదం లేదని, ఇదే సమయంలో నార్త్ కొరియాలో స్థిరత్వమూ ఏర్పడదని భావిస్తున్నారు. కాగా, 2013లో తన మేనమామ, దేశంలో రెండవ బలీయ వ్యక్తిగా గుర్తింపున్న జాంగ్ సాంగ్ థేక్ ను కిమ్ చంపించిన సంగతి తెలిసిందే.