: 'ట్రిపుల్' మోత మోగించినా ద్వారాలు తెరుచుకోవడంలేదు!
కెవిన్ పీటర్సన్... ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో ఒకప్పుడు స్టార్ బ్యాట్స్ మన్ గా వెలుగొందిన ఈ సఫారీ జాతీయుడు ఇప్పుడు కష్టకాలం ఎదుర్కొంటున్నాడు. కేపీ జాతీయ జట్టులో స్థానం కోసం ఐపీఎల్ ను వద్దనుకుని కౌంటీల బాట పట్టాడు. తాజాగా, కౌంటీ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ బాది ఫామ్ నిరూపించుకున్నాడు. సర్రే తరపున ఆడుతూ లీసెస్టర్ షైర్ పై 396 బంతుల్లో అజేయంగా 355 పరుగులు చేశాడు. 34 ఏళ్ల వయసులో ఈ స్థాయిలో చెలరేగడం మామూలు విషయం కాదని క్రికెట్ పండితులు అంటున్నారు. ఈ స్థాయిలో చితకబాదినా, ఇంగ్లాండ్ జాతీయ జట్టు ద్వారాలు మాత్రం తెరుచుకోవడంలేదు. ఇంగ్లాండ్ క్రికెట్ డైరక్టర్ ఆండ్రూ స్ట్రాస్ ఈ వేసవిలో ఇంగ్లాండ్ జట్టు ఆడే సిరీస్ లకు పీటర్సన్ ను పరిగణనలోకి తీసుకోవడంలేదని స్పష్టం చేశాడు. ఈ పరిణామం కేపీకి తప్పక నిరాశ కలిగించేదే.