: రికార్డు ధరకు అమ్ముడుపోయిన పికాసో పెయింటింగ్
విశ్వవిఖ్యాత చిత్రకారుడు పికాసో గీసిన 'ఉమెన్ ఆఫ్ అల్జీర్స్' అనే పెయింటింగ్ రికార్డు ధరకు అమ్ముడు పోయింది. న్యూయార్క్ లోని క్రిస్టీ ఫౌండేషన్ వేలం పెట్టగా, దీనిని ఓ ఔత్సాహికుడు 1028 కోట్ల రూపాయల ధరకు కొన్నాడు. బిడ్డింగ్ సమయాన్ని పొడిగించడంతో గడువు ముగిసేందుకు కొద్ది నిమిషాల ముందు టెలిఫోన్ లైన్లో ఈ పెయింటింగ్ ధరను పెంచుకుంటూ పోయారు. ఈ పెయింటింగ్ కు 900 కోట్ల రూపాయలు వస్తాయని నిర్వాహకులు అంచనా వేయగా వేలం శాల కమీషన్ తో కలుపుకుని 1152 కోట్ల రూపాయలకు ఈ పెయింటింగ్ అమ్ముడు పోయింది. దీంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. 'పాయింటింగ్ మ్యాన్' అనే పెయింట్ కూడా రికార్డు ధర పలికింది. ఇది 900 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. పికాసో పెయింటింగ్ కొన్న వాళ్లు, 'పాయింటింగ్ మ్యాన్' కొన్నవాళ్లు తమ వివరాలు వెల్లడించవద్దని కోరినట్టు నిర్వాహకులు తెలిపారు. గత పదేళ్లలో మార్కెట్ లోకి వచ్చిన పెయింటింగ్స్ లో పికాసో పెయింటింగ్ అద్భుతమైనదని ఫైన్ ఆర్ట్ ఫండ్ గ్రూప్ సీఈవో ఫిలిప్ హాఫ్ మన్ చెప్పారు.