: తల్లిదండ్రులకు ఆ హక్కు లేదు: బాంబే హైకోర్టు


తల్లిదండ్రులు తమ మైనర్ బాలల పేరిట సోషల్ మీడియా అకౌంట్లను ప్రారంభించకూడదని, వారికి ఆ హక్కు లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఓ పుణే వాసి తన మైనర్ కుమార్తె పేరిట సోషల్ మీడియా అకౌంట్లను ప్రారంభించిన వ్యవహారంలో హైకోర్టు ఈ మేరకు పేర్కొంది. మైనర్ బాలల పేరిట అకౌంట్ ను పెద్దవారు ప్రారంభిస్తే అది నకిలీ అకౌంట్ అవుతుందని జస్టిస్ మృదులా భట్కర్ తెలిపారు. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు కాకపోతే, అకౌంట్ న్యాయసమ్మతం కాదని స్పష్టం చేశారు. అంతేగాకుండా, వేరుగా ఉంటున్న భార్య పేరిట తెరిచిన సోషల్ మీడియా అకౌంట్ ను కూడా డిలీట్ చేయాలని సదరు వ్యక్తిని ఆదేశించారు. ఇకపై, కుమార్తె పేరిట, భార్య పేరిట అకౌంట్లను ప్రారంభించరాదని స్పష్టం చేశారు. భార్యతో విడాకులు తీసుకున్న ఈ పుణే వాసి తన మైనర్ కుమార్తెను అప్పగించాలని గతేడాది హైకోర్టును ఆశ్రయించాడు. ఆ బాలిక తల్లి వద్దే ఉంటోంది. క్రిస్మస్ సెలవులకు తన వద్దకు వచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ వ్యక్తి కోర్టును కోరాడు. అయితే, బాలిక తల్లి మాత్రం, ఆ వ్యక్తి వద్దకు వెళ్లడం తన కుమార్తెకు ఇష్టం లేదని, అతని వద్ద ఆ బాలిక సౌకర్యవంతంగా ఉండలేదని కోర్టుకు విన్నవించింది. ఈ కేసు విచారణలో భాగంగానే సోషల్ మీడియా అకౌంట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది.

  • Loading...

More Telugu News