: అప్పుడు చప్పట్లు కొట్టారు... ఇప్పుడు మార్చేశారు!: బీజేపీ నేతలపై రాహుల్ గాంధీ సెటైర్లు
గతంలో తాము అధికారంలో ఉండగా భూసేకరణ బిల్లు తెచ్చినప్పుడు ఎన్డీయే ప్రతిపక్షంలో ఉండి చప్పట్లు చరిచిందని యూపీఏ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుర్తు చేశారు. పార్లమెంటులో భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ ఎన్డీయే తీరును తూర్పారపట్టారు. గతంలో తాము భూసేకరణ బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టినప్పుడు చప్పట్లు చరిచి మరీ ఆహ్వానించిన ఎన్డీయే నేతలు, ఇప్పుడు ఎవరి ప్రయోజనాలకోసం ఆ బిల్లుకు సవరణలు తెచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు అద్వానీ గారు, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ సైతం భూసేకరణ బిల్లుకు అప్పట్లో మద్దతు పలికారని ఆయన సభలో కాంగ్రెస్ నేతల హర్షద్వానాల మధ్య గుర్తు చేశారు. ఎన్డీయే చెబుతున్నట్టు రైతుల ప్రయోజనాలే లక్ష్యం అయితే పాత బిల్లులోనే ఉన్నాయి కదా? కొత్తగా సవరణలు ఎందుకు? అని ఆయన నిలదీశారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యం అయితే భూసేకరణ బిల్లును మార్చాల్సిన పనిలేదని, అలా కాకుండా పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం అయితే భూసేకరణ బిల్లులో సవరణలు తేవాల్సిందేనని, కానీ కాంగ్రెస్ పార్టీ ఇందుకు అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం అని ప్రజలను మభ్యపెట్టవద్దని ఆయన సూచించారు. నిజాలతో ప్రజల ముందుకు వెళ్లి భూసేకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన సవాలు విసిరారు.