: మెరిసిన వార్నర్... గెలిచిన హైదరాబాదు!
డేవిడ్ వార్నర్ మెరుపులకు తోడు బౌలర్ల పొదుపు కారణంగా కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదు విజయం సాధించింది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ కాస్త ఇబ్బందిపడ్డా, చివరకు గెలిచింది. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాదు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ వార్నర్ వీరవిహారం చేశాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ లతో చెలరేగిన అతడు, 81 పరుగులు రాబట్టాడు. అతడికి జోడీగా ఇన్నింగ్స్ ను ప్రారంభించిన శిఖర్ ధావన్ (24), ఆ తర్వాత వచ్చిన కొత్త కుర్రాడు మొయిసెస్ హెన్రికాస్ (28) ఫరవాలేదనిపించారు. ఆ తర్వాత 186 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్, 20 ఓవర్లు ముగిసేసరికి ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు మురళీ విజయ్(24), మనన్ ఓహ్రా (20)లు శుభారంభం చేశారు. గ్లెన్ మ్యాక్స్ వెల్ (11) నిరాశపరిచినా, డేవిడ్ మిల్లర్ మాత్రం హైదరాబాదు బౌలర్లను దంచికొట్టాడు. కేవలం 44 బంతులెదుర్కొన్న అతడు రెండు ఫోర్లు, 9 సిక్స్ లతో చెలరేగి 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే చివరలో జట్టు విజయానికి కావాల్సిన పరుగులు రాబట్టడంలో మిల్లర్ సఫలీకృతం కాలేకపోయాడు. దీంతో హైదరాబాదు జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్ లో హైదరాబాదు గెలిచి నిలిచింది.