: డల్లాస్ లో కేటీఆర్ ను ఇబ్బంది పెట్టిన హిమపాతం
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన డల్లాస్ లో 'వైబ్రాంట్ హైదరాబాద్' కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సి ఉండగా, భారీ హిమపాతం అడ్డంకిగా మారింది. దానికి భారీ వర్షం తోడవడంతో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో, ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. దాదాపు నాలుగు గంటలపాటు ప్రయాణించి ఆస్టిన్ చేరుకున్నారు. కాగా, డల్లాస్ లో జరిగిన ఎన్నారైలతో భేటీలో ఆయన రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఏరోస్పేస్, హెల్త్, ఫార్మా, ఎడ్యుకేషన్, మాన్యుఫాక్చరింగ్ రంగాలకు అనుకూలమని తెలిపారు. ఇక, హైదరాబాద్ నగరం పెట్టుబడులకు స్వర్గధామం అని యువ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు యత్నించారు.