: ఆ బాలిక నిజంగానే ఆకాశంలో సగం
మహిళలు ఆకాశంలో సగం అనీ, అందుకే అవకాశాల్లో సగం భాగం కల్పించాలని హక్కుల సంఘాలు పలు సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉంటాయి. అయితే, ఈ విషయాన్ని కాస్సేపు పక్కన పెడితే, నిజంగానే ఓ అమ్మాయి ఆకాశంలో జన్మించిన అరుదైన ఘటన ఎయిర్ కెనడా విమానంలో చోటుచేసుకుంది. కెనడాకు చెందిన 23 ఏళ్ల మహిళ ఎయిర్ కెనడా విమానంలో టోక్యో (జపాన్) వెళ్తుండగా పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె విమాన సిబ్బందికి విషయం వివరించింది. వెంటనే విమానాన్ని కిందకి దించే వెసులుబాటు లేకపోవడంతో, ఎవరైనా వైద్యులుంటే సాయం చేయాల్సిందిగా సిబ్బంది ప్రయాణికులను కోరారు. దీంతో ప్రయాణికుల్లో ఉన్న ఓ డాక్టర్ సహాయంతో ఆమె ప్రశాంతంగా బుజ్జాయికి జన్మనిచ్చింది. విమానాన్ని టోక్యో వెలుపలి 'నారిట' ఎయిర్ పోర్టులో దించి వారిని ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆకాశంలో పుట్టడంతో ప్రయాణికులు అమ్మాయిని ఆకాశంలో సగంగా వ్యాఖ్యానించగా, తన భార్య ఆకాశంలో ప్రసవిస్తుందని భావించలేదని బాలిక తండ్రి హర్షం వ్యక్తం చేశాడు. అందమైన అమ్మాయి పుట్టిందని బాలిక తండ్రి మురిసిపోతూ చెప్పాడు.