: యువరాజ్ నిజమే చెప్పాడు... అది మార్కెట్ నిర్ణయించిన ధర: ఢిల్లీ డేర్ డెవిల్స్
ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ కు ఐపీఎల్ వేలంలో అదిరిపోయే ధర పలకడం తెలిసిందే. రూ.16 కోట్లు పోసి ఈ పంజాబ్ ఆల్ రౌండర్ ను డేర్ డెవిల్స్ యాజమాన్యం కొనుక్కుంది. అయితే, టీమిండియాలో చోటు కోల్పోయి, పునరాగమనంపై భరోసా లేని ఆటగాడికి అంత ధర పలకడంపై సందేహాలు తలెత్తాయి. యువరాజే డిమాండ్ చేశాడని, లాబీయింగ్ జరిగిందని కథనాలు వచ్చాయి. వీటిపై ఢిల్లీ డేర్ డెవిల్స్ సీఈఓ హేమంత్ దువా స్పందించారు. విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా, తానెవరినీ ఇంత ఇవ్వాలని అడగలేదని యువరాజ్ చెప్పాడని, అది నిజమే అని అన్నారు. యువరాజ్ కు రూ.16 కోట్లు ఐపీఎల్ మార్కెట్ నిర్ణయించిన ధర అని స్పష్టం చేశారు. తన ధరపై యువరాజ్ తమనేమీ సంప్రదించలేదని తెలిపారు. తాజా ఐపీఎల్ సీజన్ లో జట్టు ఆటతీరుపై మాట్లాడుతూ ఆయన ఈ వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఇంత ధర పెట్టి ఓ ఆటగాడిని కొనుగోలు చేయాలని ఏ ఫ్రాంచైజీ కూడా భావించదని, తాము అంతేనని, కానీ, ప్రత్యర్థి ఫ్రాంచైజీ ధరను పెంచుతూ పోతున్నప్పుడు ఇలాంటివి చోటు చేసుకుంటాయని తెలిపారు. ఆ విధంగా అది మార్కెట్ నిర్ణయించిన ధరే అని ఉద్ఘాటించారు.