: తాజ్ మహల్ కు 'మడ్ ప్యాక్ థెరపీ'
ప్రేమకు చిహ్నమంటూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడం తాజ్ మహల్ క్రమంగా తన శోభను కోల్పోతోందని నిపుణులు ఏళ్లుగా హెచ్చరిస్తున్నారు. ఈ పాలరాతి నిర్మాణం వన్నె తగ్గుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నష్ట నివారణకు రంగంలోకి దిగింది. తాజ్ మహల్ పై ఏర్పడిన నల్లని మచ్చలను తొలగించేందుకు మడ్ ప్యాక్ థెరపీ అనుసరించాలని నిర్ణయించింది. ఈ కార్యాచరణ జూన్ చివరినాటికి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఏప్రిల్ నెలలో తాజ్ మహల్ ను పరిశీలించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పర్యావరణం) నల్లని మచ్చల విషయమై ఆర్కియలాజికల్ విభాగాన్ని మందలించింది. ఈ నేపథ్యంలో, ఏఎస్ఐ మాట్లాడుతూ... ఈ మడ్ ప్యాక్ థెరపీని 1983 నుంచి తాజ్ మహల్ పై వినియోగిస్తున్నామని తెలిపింది. కాలుష్యం కారణంగా ఏర్పడ్డ మచ్చలను, ఏళ్లనాటి గుట్కా, పాన్ మరకలను ఈ విధానం ద్వారానే గతేడాది తొలగించామని ఓ అధికారి వివరించారు. ఈ థెరపీీీ... ముఖంపై జిడ్డు, మచ్చలను తొలగించేందుకు బురద మన్ను ఉపయోగించడం వంటిదేనని ఆయన పేర్కొన్నారు.