: రసీదు అడిగిన మహిళపై ఇటుకల వర్షం కురిపించాడు!
ఢిల్లీలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మహిళతో దురుసుగా ప్రవర్తించి సస్పెండయ్యాడు. వివరాల్లోకెళితే... గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో ఓ మహిళ తన కుమార్తెను పాఠశాలకు తీసుకెళుతుండగా, ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీశ్ చంద్ర ఆమెను ఆపాడు. ఆర్సీ, లైసెన్స్ చూపాలని కోరాడు. అలాగే, రెడ్ లైట్ క్రాసింగ్ అంటూ రూ.200 ఇవ్వాలని అడిగాడు. అందుకామె రసీదు ఇవ్వమని కోరింది. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ అందుకు అంగీకరించలేదు. దీంతో, వారిద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. రసీదు కోసం ఆమె పట్టుబట్టడంతో సతీశ్ చంద్రలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే పక్కనే ఉన్న ఇటుకలను ఆమెపై విసరడం ప్రారంభించాడు. ఆమె ఆ రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు చాలా కష్టపడింది. కానీ, ఓ రాయి ఆమెను బలంగా తాకింది. బాధితురాలు గట్టిగా అరవడంతో ఇతరులు అక్కడికి చేరుకున్నారు. అతడిపై అధికారులకు ఫిర్యాదు చేయగా, వెంటనే సస్పెండ్ చేశారు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ చర్యకు చింతిస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు.