: ఏపీలో సర్కారీ మద్యం షాపులు...వారంలోగా తుది నిర్ణయమన్న అబ్కారీ మంత్రి కొల్లు
ఏపీలో ఇకపై మద్యం విక్రయాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ప్రభుత్వమే మద్యాన్ని నేరుగా విక్రయిస్తుందట. ఇప్పటికే తమిళనాడులో ఈ తరహా మద్యం పాలసీ అమలువుతోంది. కేరళలోనూ ఇటీవల అక్కడి ప్రభుత్వం ఈ తరహా పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఏపీ అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. అక్కడ అమలవుతున్న మద్యం పాలసీని పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. కొద్దిసేపటి క్రితం సీఎం నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయిన ఆయన కొత్త మద్యం పాలసీపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రభుత్వ విక్రయాల ద్వారా సర్కారీ ఖజానాకు భారీ ఆదాయం సమకూరడమే కాక, కల్తీ మద్యం బెడద తప్పుతుందని కూడా ఆయన చంద్రబాబుకు వివరించారు. అంతేకాక, ప్రభుత్వం చేపట్టే విక్రయాల కోసం కాంట్రాక్టు పద్ధతిన నియమించుకునే 15 వేల నుంచి 20 మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తుందని ఆయన చెప్పుకొచ్చినట్లు సమాచారం. కొల్లు రవీంద్ర వాదనతో పూర్తిగా ఏకీభవించిన చంద్రబాబు సర్కారీ మద్యం విక్రయాలకే పచ్చజెండా ఊపినట్టు సమాచారం. భేటీ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన కొల్లు మీడియాతో మాట్లాడుతూ వారంలోగా కొత్త మద్యం పాలసీని ప్రకటిస్తామని తెలిపారు.