: సంబరాల్లో ‘అమ్మ’ అభిమానులు... టపాసుల మోతతో హోరెత్తుతున్న తమిళనాడు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అభిమానులు సంబరాలకు తెరతీశారు. అక్రమాస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు కొద్దిసేపటి క్రితం నిర్దోషిగా ప్రకటించింది. అప్పటికే బెంగళూరులోని కోర్టు పరిసరాల్లోకి చేరుకున్న జయలలిత అభిమానులు, అన్నా డీఎంకే కార్యకర్తలు పెద్ద పెట్టున జయజయధ్వానాలు చేశారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాలు జయలలిత నినాదాలతో హోరెత్తాయి. కోర్టు తీర్పు సమాచారం తెలిసిన వెంటనే తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. అన్నా డీఎంకే కార్యకర్తలు, జయలలిత అభిమానులు బాణాసంచా పేల్చారు. దీంతో తమిళనాడు టపాసుల మోతతో హోరెత్తిపోతోంది. సంబరాల జోరు క్షణక్షణానికి పెరుగుతోంది. చెన్నైలోని జయలలిత నివాస ప్రాంతం, అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం పరిసరాల్లో జయలలిత నినాదాలు హోరెత్తుతున్నాయి.