: చెన్నైలో జయలలిత... బెంగళూరు బయల్దేరిన అభిమానులు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు మరో గంటలో వెలువడనుంది. ఈ క్రమంలో అటు తమిళనాడుతో పాటు బెంగళూరులోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు జయలలితను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును జయలలిత సవాల్ చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక హైకోర్టు దీనిపై తుది తీర్పును వెలువరించనుంది. ప్రస్తుతం బెయిల్ లభించిన జయలలిత చెన్నైలోని తన పోయెస్ గార్డెన్ లో ఉన్నారు. నేడు తీర్పు వెలువడుతున్నప్పటికీ ఆమె చెన్నైలోనే ఉంటారు. మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుంచి ఆమె అభిమానులు బెంగళూరు బయలుదేరారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో జయ మద్దతుదారులు నగరానికి చేరుకున్నారన్న సమాచారంతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. హైకోర్టు పరిధిలో 144 సెక్షన్ ఆంక్షలను విధించిన పోలీసులు భారీ ఎత్తున బలగాలను మోహరించారు. మరోవైపు ఆందోళనలు తప్పవన్న సమాచారంతో కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోనూ భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి.