: కడియం వర్సెస్ ఎర్రబెల్లి... తొలుత మాటల యుద్ధం, ఆ తర్వాత ప్రశంసలు!
తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావులిద్దరూ వరంగల్ జిల్లాకు చెందినవారే. అంతేకాదు, వీరిద్దరి మండలం కూడా ఒక్కటే. పాలకుర్తి మండలానికి చెందిన వీరిద్దరూ గతంలో టీడీపీలో కీలక నేతలు. ఎన్టీఆర్ పిలుపు మేరకు లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయ రంగంలోకి దిగిన కడియం, ఆ తర్వాత పార్టీలోనే కాక ఉమ్మడి రాష్ట్రంలో కూడా పలు కీలక శాఖలకు మంత్రిగానూ పనిచేశారు. కడియంతో పాటే కాస్త అటు ఇటూగా రాజకీయాల్లోకి వచ్చిన ఎర్రబెల్లి కూడా టీడీపీలో బలమైన నేతగా ఎదిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎర్రబెల్లి టీడీపీలోనే ఉండిపోగా, కడియం మాత్రం పార్టీ మారారు. టీఆర్ఎస్ లో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. నిన్న మిషన్ కాకతీయ పుణ్యమాని వీరిద్దరూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో ఒకే వేదికను పంచుకున్నారు. గతంలో కలిసిమెలసి ఉన్న వీరిద్దరూ నిన్న మాత్రం వేదికపైనే పోట్లాడుకున్నారు. మాటల యుద్ధానికి దిగారు. ఆంధ్రా నేతల పెత్తనం కింద పనిచేయడమేంటని కడియం, ఎర్రబెల్లిని తూర్పారబట్టారు. దీంతో కంగుతిన్న ఎర్రబెల్లి కూడా వెనువెంటనే తేరుకుని పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దంటూ వార్నింగిచ్చారు. అక్కడితో ఆ మాటల యుద్ధానికి తెరపడగా, తర్వాత కాసేపటికే తొర్రూరు మండలం చెర్లపాలెం చేరుకున్నారు. జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. కడియంను అనుభవజ్ఞుడైన మంత్రిగా ఎర్రబెల్లి కీర్తిస్తే... ఎర్రబెల్లి తనకు మిత్రుడంటూ కడియం కొనియాడారు.