: మీడియాతో అమీతుమీకే కేజ్రీ నిర్ణయం... వ్యతిరేక వార్తలపై కేసులకు ఆదేశాలు
ఎన్నికల దాకా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మీడియాలో పెద్ద పొలిటికల్ స్టార్. ఏ చిన్న పనిచేసినా మీడియా ఆయనను ఆకాశానికెత్తేసింది. రాజకీయాల్లో సరికొత్త వ్యూహాలు, మీడియా మద్దతుతో ఆయన ఢిల్లీ సీఎం పీఠాన్ని ఏడాది వ్యవధిలో రెండు సార్లు అధిష్టించారు. అయితే సీఎం పీఠాన్ని ఎక్కగానే ఆయన మీడియాను శత్రువుగా పరిగణించారు. సచివాలయంలోకి అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో కేజ్రీకి దూరంగా ఉండేందుకు మీడియా ఎంతమాత్రం అంగీకరించలేదు. ఢిల్లీ సర్కారుపై వ్యతిరేక వార్తల పరంపరను ప్రారంభించింది. దీంతో కేజ్రీకి చిర్రెత్తుకొచ్చినట్లుంది. వ్యతిరేక వార్తలు రాసే మీడియా సంస్థలు, ఆయా సంస్థల ప్రతినిధులపై పరువు నష్టం కేసులు దాఖలు చేయాలని నిన్న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై యావత్తు మీడియా భగ్గుమన్నా, వెనక్కు తగ్గేందుకు మాత్రం కేజ్రీ ససేమిరా అంటున్నారు. మరి భవిష్యత్తులో ఈ విషయం ఎంతదాకా వెళుతుందో చూడాలి.