: అధికార దర్పం అక్కర్లేదు...సొంత ఖర్చులతో విధి నిర్వహణ: టీటీడీ చైర్మన్ చదలవాడ


తిరుమల వెంకన్నను నేరుగా దర్శించుకునే భాగ్యం. మహాద్వారం ద్వారా ప్రవేశం. అంతేకాదు, ఖరీదైన కారు, బంగళా. కొండపైనా, కిందా కార్యాలయం. ఖర్చులన్నీ వెంకన్నవే... తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా ఎంపికైన వ్యక్తికి అందే సౌకర్యాలివి. గతంలో చైర్మన్లుగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారిలో మెజారిటీ మంది వీటిని అనుభవించారు. అయితే, ఇటీవల టీటీడీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి అందరిలోకి ప్రత్యేకం. ఎందుకంటే, టీటీడీ చైర్మన్ గా పదవి దక్కింది వెంకన్నకు సేవ చేయడానికి మాత్రమే కాని, అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి కాదని ఆయన తేల్చిచెప్పేశారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. టీటీడీ చైర్మన్ అయినా తాను మహాద్వారం ద్వారా ప్రవేశించనని ఆయన చెప్పారు. అంతేకాక విధి నిర్వహణకు వెంకన్న సొమ్మును చిల్లిగవ్వ కూడా వాడనని తెలిపారు. మొత్తం ఖర్చును సొంతంగానే భరిస్తానని ప్రకటించారు. టీటీడీ అందించే కారును కూడా తీసుకోనన్నారు. సొంత వాహనాన్నే వినియోగిస్తానన్నారు. ఖరీదైన అతిథి గృహంలో కాకుండా సామాన్య భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఎస్వీ అతిథి గృహంలోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటానని ప్రకటించారు. ఇక తిరుమలలో చైర్మన్ గా కాక సాధారణ భక్తుడిలానే ఉంటానని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News