: ఆరో రోజైనా ఆర్టీసీ సమ్మె ముగిసేనా?... కార్మిక సంఘాలతో ఇరు రాష్ట్రాల చర్చలు
తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో ఆరో రోజుకు చేరుకుంది. గడచిన ఐదు రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, ఇరు రాష్ట్రాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నిన్న రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కార్మికులతో వేర్వేరుగా చర్చలు జరిపాయి. చర్చల్లో భాగంగా 43 శాతం ఫిట్ మెంట్ ఇస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చిచెప్పిన కార్మికులు, తమ డిమాండ్లు న్యాయమైనవేనని వాదించారు. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కాస్త సర్దుకుపోవాలని ఇరు ప్రభుత్వాలు కార్మికులను కోరాయి. తెలంగాణకు సంబంధించి నేడు కూడా కార్మిక సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరగనున్నాయి. అవసరమైతే కార్మిక సంఘాల నేతలను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లేందుకు కూడా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి యత్నిస్తున్నారు. ఇక ఏపీలోనూ సర్కారు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగానే ముగిసినట్లు సమాచారం. దీంతో నేటి సాయంత్రంలోగా ఇరు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సమ్మెను ఆర్టీసీ కార్మికులు విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.