: పాతబస్తీ యువకుల 'మృత్యు క్రీడ'
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువకులు ఇప్పుడు ఓ 'మృత్యు క్రీడ'కు అలవాటుపడ్డారు. అంతర్జాతీయంగా బాగా ప్రాచుర్యంలో ఉన్న మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) పోరాటాల తరహాలో స్ట్రీట్ ఫైట్లకు తెరదీశారు. వాస్తవానికి ఈ ఫైట్లో శిక్షణ పొందిన మార్షల్ ఆర్ట్స్ యోధులు తలపడతారు. వారికి ఆత్మరక్షణ పద్ధతులు బాగా తెలిసి ఉంటాయి. తగిన రక్షణ ఉపకరణాలు కూడా ధరిస్తారు. అయితే, హైదరాబాదులోని పాతబస్తీ కుర్రాళ్లు మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ తరహా ఫైట్లు చేస్తున్నారు. నబిల్ అనే విద్యార్థి మృతితో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ గల్లీలో జరిగిన ఫైట్లో నబిల్ ప్రత్యర్థి చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. కొద్ది వ్యవధిలోనే కుప్పకూలిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు పోయాయి. అయితే, అది సాధారణ మరణం అని నమ్మించేందుకు నబిల్ మిత్రులు యత్నించారు. ఆ ఫైట్ కు సంబంధించిన వీడియో బయటపడడంతో విషయం వెల్లడైంది. నబిల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది.