: హైదరాబాదు టూ విజయవాడ... చార్జీ రూ.3000: చెలరేగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్
ఆర్టీసీ కార్మికుల సమ్మె జనం జేబులను గుల్ల చేస్తోంది. కార్మికుల సమ్మె కారణంగా నాలుగు రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో జనానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఇతర వాహనాలే దిక్కయ్యాయి. ఇదే అదనుగా సమ్మె మొదలైన తొలిరోజే చక్రం తిప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను పెంచేశాయి. రోజులు పెరుగుతున్న కొద్దీ చార్జీలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లాలంటే ప్రయాణికులు చార్జీ కింద రూ.3 వేలు చెల్లించాల్సి వస్తోంది. సాధారణంగా బస్సు చార్జీ రూ.500 అయితే ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం ఆరు రెట్లు అధికంగా రూ.3 వేలను వసూలు చేస్తున్నాయి. హైదరాబాదు నుంచి ఒంగోలుకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ రూ.3 వేలు వసూలు చేస్తున్నాయి. మిగిలిన అన్ని రూట్లలోనూ ఇదే తరహా దోపిడీకి ప్రైవేట్ ట్రావెల్స్ తెరలేపాయి.