: మోదీగారూ! విదేశీ మోజు వీడండి...మీ నియోజకవర్గంలో ఏం జరిగిందో చూడండి: విదేశీ విద్యార్థిని
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ మోజు విడనాడి, తన సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని అమెరికాకు చెందిన భారతీయ మహిళా డాక్టర్ భాస్వతీ భట్టాచార్య సూచించారు. వారణాసిలోని బనారస్ యూనివర్సిటీలో ఆయుర్వేదంలో ఆమె పీహెచ్ డీ చేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ, ఏప్రిల్ 22న యూనివర్సిటీ క్యాంపస్ లో ఫ్రెండ్ తో కలిసి నడుస్తుండగా, ఐదుగురు గుర్తు తెలియని దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారని, సెల్ ఫోన్ ఎత్తుకుపోయారని, ల్యాప్ టాప్ ధ్వంసం చేశారని, తాను ఆయుర్వేద డాక్టర్ అని తెలియడంతో చేతులు చూపించి భవిష్యత్ చూడమన్నారని ఆమె తెలిపారు. జరిగిన దారుణంపై స్థానిక లంకా పోలీస్ స్టేషన్ కు వెళ్తే... దాడి జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి నటించి చూపించాలని వేధించారని, కేసు నమోదు చేసుకోకుండా కామ్ గా ఉండమని సలహా ఇచ్చారని ఆమె మండిపడ్డారు. ఎస్పీ జోక్యం చేసుకుంటే కానీ ఘటనపై కేసు నమోదు చేయలేదని ఆమె వాపోయారు. లైంగిక దాడి బాధితులను మహిళా వైద్యులు మాత్రమే పరీక్షించాలని నిబంధనలు చెబుతుండగా, ఇద్దరు మగ డాక్టర్లు, ఒక మహిళ పోలీస్ కానిస్టేబుల్ సమక్షంలో పరీక్షలు నిర్వహించారని ఆమె మండిపడ్డారు. ప్రధాని విదేశాలపై మోజు విడనాడి, తన నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఆమె సూచించారు. విదేశీ పెట్టుబడిదారులకంటే దేశ ప్రజల బాగోగులు ముఖ్యమన్న విషయం ప్రధాని గుర్తించాలని ఆమె సూచించారు.