: 'హిట్ అండ్ రన్' సిగ్గుమాలిన చర్య, నేనూ బాధితుడినే: నాటి ఘటనను గుర్తు చేసుకున్న బాలీవుడ్ డైరెక్టర్


కారుతో యాక్సిడెంట్ చేసిన తరువాత సల్మాన్ అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని గుర్తు చేసుకుంటూ, తనకు కలిగిన అనుభవాన్ని బాలీవుడ్ డైరెక్టర్, రైటర్ చారుదత్ ఆచార్య ఫేస్ బుక్ లో పంచుకున్నారు. ఈ పోస్ట్ 16 గంటల్లో 8 వేల షేర్స్ తెచ్చుకొని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అభిషేక్ బచ్చన్ నటించిన 'దమ్ మారో దమ్' చిత్రానికి రైటర్ గా, అంతకుముందే 'సోనాలీ కేబుల్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించి పేరుతెచ్చుకున్న ఆచార్య తన అనుభవాన్ని వివరిస్తూ, "అది 1998వ సంవత్సరం. ఓ యువతి (బాలీవుడ్ లోని ఓ ప్రముఖ వ్యక్తి కుమార్తె) వేగంగా కారు నడుపుతూ, నేను ప్రయాణిస్తున్న ఆటోను గట్టిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నా ఎడమ కాలు తీవ్రంగా దెబ్బతింది. కారు నుంచి కిందకు దిగిన ఆమె, నా పరిస్థితిని చూసి కూడా, స్పందించక వెంటనే కారెక్కేసి వెళ్లిపోయింది. ఎవరో అపరిచితులు నన్ను ఆసుపత్రికి తరలించారు. నాకప్పటికి వైద్య, జీవిత బీమాలు లేవు. మూడు సర్జరీలు జరిగాయి. ఆ యువతి తరువాత నా ఇంటికి వచ్చి కలిసి వెళ్లింది. ఆమెపై ఎటువంటి కేసులూ నమోదు కాలేదు. నేను ఇప్పటికీ కర్ర సాయంతోనే నడుస్తున్నా. ఆటో, కారుకున్న బీమా కారణంగా స్వల్ప మొత్తం నాకు దక్కింది" అన్నారు. ఇక సల్మాన్ కేసు గురించి చెబుతూ "వాస్తవానికి ఇది డ్రంకెన్ డ్రైవింగ్ సమస్య కాదు. యాక్సిడెంట్ తరువాత పారిపోవడం అత్యంత సిగ్గుమాలిన, పిరికిపంద చర్య. తనకు ఈ స్టార్ డంను ఆపాదించిపెట్టడంలో పాత్ర వహించిన ఆ బాధితులకు సహాయం చేయకుండా 'కండలవీరుడు' పలాయనం చిత్తగించడం... తమను వంద కోట్ల క్లబ్బులకు చేర్చే ఒక స్టార్ ను వెన్నెముక లేని సినీ పరిశ్రమ రక్షించాలని చూడడం సిగ్గుమాలిన చర్య కిందకే వస్తుంది" అంటూ ఘాటుగా విమర్శించాడు.

  • Loading...

More Telugu News