: వాట్స్ యాప్ ద్వారా రాజీనామా చేసిన ఎస్సైని బదిలీ చేశారు!
ఉత్తరప్రదేశ్ లో ఓ ఎస్సై వాట్స్ యాప్ ద్వారా తన రాజీనామా సమాచారాన్ని అధికారులకు పంపడం తెలిసిందే. అయితే, అతడి రాజీనామాను ఆమోదించని ఉన్నతాధికారులు మరో స్టేషన్ కు బదిలీ చేశారు. కాన్పూర్ జోన్ ఐజీ అశుతోష్ పాండే దీనిపై మాట్లాడుతూ... ఎస్సై వినోద్ కుమార్ ను ఝాన్సీకి బదిలీ చేశామని, కాన్పూర్ లో 12 ఏళ్ల సర్వీసు పూర్తయిందని, ఒకే ప్రదేశంలో పన్నెండేళ్ల పాటు పనిచేసిన ఎస్సైలను నిబంధనల ప్రకారం బదిలీ చేస్తామని తెలిపారు. ఈ విధంగా సర్వీసు పూర్తి చేసుకున్న 34 మంది ఎస్సైలను కూడా మే 1న బదిలీ చేసినట్టు చెప్పారు. అయితే, పోలీసు వర్గాలు మాత్రం, సీనియర్ అధికారులను కాపాడేందుకే వినోద్ కుమార్ ను బదిలీ చేశారని ఆరోపిస్తున్నాయి. తనను సీనియర్ అధికారులు వేధిస్తున్నారంటూ వినోద్ కుమార్ వాట్స్ యాప్ ద్వారా పంపిన రాజీనామా సందేశంలో వాపోయాడు.