: సల్మాన్ కేసులో ప్రధాన సాక్షి ఏమయ్యాడు?...కేసు నిలబడడానికి కారణం అతనేనా?


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేంత పలుకుబడి... ఎవర్నైనా ప్రలోభపెట్టగలిగేంత డబ్బు, మందీ మార్బలం, అభిమానగణం, అనుచరగణం. ఏది కావాలంటే అది కాళ్లముందుకు చేర్చే సేవకులు...అన్నింటికంటే 'సల్మాన్ కు శిక్ష పడితే మాకేమొస్తుంది? పరిహారం ఇస్తే బాగుంటుంది' అని నసుగుతున్న బాధితులు. న్యాయస్థానంలో తిమ్మిని బమ్మి చేయగల న్యాయవాదుల అండ. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ సల్మాన్ ఖాన్ కు న్యాయస్థానం ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం వెనుక ప్రధాన కారణం ఒకే ఒక వ్యక్తి. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ రవీంద్రపాటిల్! నిజానికి సల్మాన్ ఖాన్ కారు చక్రాల కిందపడి మరణించింది అమెరికా ఎక్స్ ప్రెస్ బేకరీ ఉద్యోగి మాత్రమే కాదు. అతని బాడీ గార్డ్ పాటిల్ కూడా మరణించాడు. 13 ఏళ్ల క్రితం పూటుగా మద్యం తాగిన సల్మాన్ కారు ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తులపై నుంచి అమెరికా ఎక్స్ ప్రెస్ బేకరీలోకి దూసుకుపోయిన ఘటనకు ప్రత్యక్ష సాక్షి అతని బాడీగార్డ్ పాటిల్. మహారాష్ట్రలోని సతారాకు చెందిన రవీంద్ర పాటిల్ కు ఖాకీ చొక్కా అంటే విపరీతమైన మక్కువ. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. వెంటనే స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్ (ఎస్ఓఎస్)లో కమాండోగా చేరేందుకు శిక్షణ పొందాడు. ఇంతలో సల్మాన్ కు అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ కంటే మంచి శరీరదారుఢ్యం కలిగి, చురుగ్గా ఉండే పాటిల్ ను అతనికి బాడీగార్డ్ గా నియమించారు పై అధికారులు. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ బేకరీలోకి కారుతోలినప్పుడు పాటిల్ నేరుగా బాంధ్రా స్టేషన్ కు వెళ్లి జరిగింది జరిగినట్టు ఫిర్యాదు చేశాడు. దానిని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. తరువాత న్యాయస్థానంలో కూడా జరిగినది జరిగినట్టు చెప్పాడు. అంతే, చూస్తుండగానే అతని జీవితం తల్లకిందులైపోయింది. హై ప్రొఫైల్ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందుకు పాటిల్ ను ఉద్యోగం నుంచి తప్పించారు. సల్మాన్ సన్నిహితులు, అతని మద్దతుదారుల నుంచి ఒత్తిడి ఎలాగూ ఉండేదే. పోలీస్ శాఖ నుంచి కూడా పాటిల్ ఒత్తిళ్లు ఎదుర్కొన్నాడు. దీంతో కమాండో శిక్షణ పొందిన పాటిల్ శారీరకంగా, మానసికంగా కుంగిపోయాడు. దీంతో విధులకు గైర్హాజరయ్యాడు. ముంబైకి దూరంగా వెళ్లిపోయాడు. దీనిపై అతని సోదరుడు మిస్సింగ్ కేసు కూడా పెట్టాడు. ఇంతలో కేసు విచారణకు వచ్చింది. సాక్ష్యమివ్వాల్సిన పాటిల్ కనపడకపోవడంతో న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేశారు. మహాబలేశ్వరంలో 2006 మార్చిలో అతనిని అరెస్టు చేశారు. తరువాత ఆర్థర్ రోడ్ జైలుకు పంపారు. దీంతో అతడిని పోలీసు శాఖ డిస్మిస్ చేసింది. జీతం కూడా అందలేదు. కొన్నాళ్లకు జైలు నుంచి విడుదలైనా, క్షయ సోకింది. దీంతో రూపం మారిపోయింది. గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన పాటిల్ నుంచి అతని భార్య విడాకులు తీసుకుంది. తరువాత పాటిల్ కొంత కాలం కనిపించలేదు. 2007లో ముంబైలోని శివిడీ రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ 50 రూపాయలు సంపాదించుకుని సెవ్రీలోని టీబీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేవాడు. నడవలేని, మాట్లాడలేని స్థితిలో పాటిల్ 2007 అక్టోబర్ 4న కన్నుమూశాడు. మరణానికి కొద్ది రోజుల ముందు మీడియా ప్రతినిధులతో ఆ ప్రమాదం తన జీవితాన్ని నాశనం చేసిందని వాపోయాడు. ఈ రకంగా సల్మాన్ కారు చక్రాల కింద రెండు జీవితాలు నలిగిపోయాయి.

  • Loading...

More Telugu News