: కేంద్ర మంత్రి వెంకయ్యపై సినీ నటుడు శివాజీ ఫైర్... ఈ 10 ప్రశ్నలకు జవాబివ్వాలంటూ డిమాండ్
రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ, రాష్ట్రం ముక్కలు కావడానికి సహకరించిన బీజేపీ... ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎందుకు విముఖంగా ఉందని సినీ నటుడు శివాజీ ప్రశ్నించాడు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన... ఆంద్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదో చేస్తారని ఓట్లేసి గెలిపిస్తే... రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా బీజేపీ అధిష్ఠానం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై మండిపడ్డ శివాజీ... వెంకయ్యకు 10 ప్రశ్నలను సంధించారు. ఆ ప్రశ్నలు ఇవే. 1. ప్రత్యేక హోదాపై కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఆర్థిక సంఘంపైకి నెట్టడం అన్యాయం కాదా? ఇది తప్పించుకోవడం కాదా? 2. ప్రధాని తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి 5 నిమిషాల్లో ప్రత్యేక హోదా ఇప్పించగలరు. కానీ, కుంటి సాకులు చూపి ప్రత్యేక హోదా ఇవ్వని మాట వాస్తవం కాదా? 3. ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నామని మీరు (వెంకయ్య) అనడం అబద్ధం కాదా? 4. పదవిని చేపట్టిన తర్వాత ప్రత్యేక హోదా కోసం 5 నిమిషాలు కూడా మీరు ప్రయత్నించని మాట వాస్తవం కాదా? 5. ప్రత్యేక హోదాపై కొందరు చేస్తున్న పోరాటం ప్రచారం కోసమే అని ఇప్పుడు మీరు అంటున్నారు. విశాఖ ఆంధ్రుల హక్కు అని గతంలో మీరు చేసిన పోరాటం కూడా ప్రచారం కోసమేనా? 6. మీరు జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారే... అది కూడా ప్రచారం కోసమేనా? 7. కేవలం మోదీ ప్రాపకం కోసం, పదవి కోసం, మరోసారి రాజ్యసభ నుంచి ఎన్నిక కావడం కోసం... ఏపీ ప్రయోజనాలను మీరు తాకట్టు పెడుతున్నారని వస్తున్న విమర్శలపై తమరి సమాధానం ఏమిటి సార్? 8. ఏపీని అభివృద్ధి చేయాలన్న కాంక్ష బీజేపీకి లేదా? 9. ఏపీ తరపున మీరు ఎందుకు మాట్లాడటం లేదు? 10. ప్రత్యేక హోదాకై పోరాడుతున్న వారిని ఎందుకు చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు? అనంతరం మాట్లాడుతూ, తమరు చేస్తే ఉద్యమం... మేము చేస్తే మాత్రం ప్రచారమా? అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది ఏపీ దయవల్లే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వెంకయ్యకు సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేందుకు కృషి చేయాలని... ఇప్పటిదాకా ఆడిన నాటకాలు కట్టిపెట్టాలని సూచించారు.