: దావూద్ ఇబ్రహీంపై స్పష్టమైన ప్రకటన చేయనున్న కేంద్రం
దావూద్ ఇబ్రహీంపై కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్ సభలో స్పష్టమైన ప్రకటన చేయనుంది. గడచిన సోమవారం లోక్ సభ సెషన్ లో దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నారు? ఆయనను పట్టుకునే ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయి? వంటి ప్రశ్నలను సభ్యులు సంధించినప్పుడు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడన్న విశ్వసనీయ సమాచారమేదీ తమ వద్ద లేదని, అసలు దావూద్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదని సమాధానమిచ్చారు. దీనిపై పెను దుమారం రేగింది. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని లాహోర్ లో ఉన్నట్టు పలు సాక్ష్యాలు ఉన్నాయని, కేంద్రం ప్రకటన ఐఎస్ఐ సంస్థ ప్రకటనలా ఉందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో సోమవారం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో స్పష్టమైన ప్రకటన చేయనున్నారు.