: వివాదం రేపిన టీడీపీ ప్రత్యేక హోదా మెమొరాండం
ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి ఇచ్చిన మెమొరాండం వివాదం రేపింది. ప్రత్యేక హోదా కావాలని కోరుతూ ఇచ్చిన ఈ మెమొరాండం, గతంలో లోక్ సభలో ఓ ఎంపీ ప్రసంగాన్ని యథాతథంగా కాపీ చేసినట్టు విమర్శలు వినపడుతున్నాయి. ప్రత్యేకహోదా కోసం ప్రధానిని కలిశామని చెప్పుకున్న టీడీపీ నేతలు, ఆయనకు ఇచ్చిన వినతి పత్రంలో ఆయన ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం విచిత్రంగా ఉందని, కేంద్రానికి సుప్రీం మోదీ అయితే ఆయన ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమేంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించాలని ఆ మెమొరాండంలో కోరడం హాస్యాస్పదంగా ఉందని, ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్టును పార్లమెంటుకు సమర్పించిందని పేర్కొంటున్నారు. ఈ మెమొరాండంతో టీడీపీ చిత్తశుద్ధి తెలిసిపోతోందని పలువురు విమర్శిస్తున్నారు.