: నష్టాల నుంచి తేరుకుని ముందుకు దూకిన మార్కెట్ బుల్
ఇటీవలి కాలంలో వరుసగా నష్టపోతూ వస్తున్న భారత స్టాక్ మార్కెట్ నేడు ఒక్కసారిగా ముందుకు దూకింది. గత కొంత కాలంగా షేర్లను 'షార్ట్' చేస్తూ వస్తున్న ఇన్వెస్టర్లు వాటిని కవరింగ్ చేసుకునే ప్రయత్నాన్ని చేయడంతో సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 200 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ మరే దశలోనూ వెనుతిరిగి చూడలేదు. గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 506.28 పాయింట్లు పెరిగి 1.90 శాతం లాభంతో 27,105.39 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 134.20 పాయింట్లు పెరిగి 1.67 శాతం లాభంతో 8,191.50 పాయింట్ల వద్దా కొనసాగాయి. బీఎస్ఈలో కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా మిగిలిన అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లూ లాభపడ్డాయి. ఆటో ఇండెక్స్ అత్యధికంగా 2.67 శాతం పెరిగింది. 26,814 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ సూచిక ఒక దశలో 27,196 పాయింట్ల వరకూ దూసుకెళ్లింది. పీఎన్ బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హీరో మోటో, ఆసియన్ పెయింట్స్ తదితర కంపెనీలు నష్టపోగా, టాటా మోటార్స్, సిప్లా, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభపడ్డాయి.