: మైక్రోమ్యాక్స్ పై కన్నేసిన అలీబాబా
దేశవాళీ మొబైల్ దిగ్గజం మైక్రోమ్యాక్స్ లో 20 శాతం వాటాలను కొనుగోలు చేయాలని చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఈ-కామర్స్ జెయింట్ అలీబాబా భావిస్తోంది. ఇండియాలో శాస్త్రసాంకేతికత శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో సాధ్యమైనంత ఎక్కువ భాగస్వామ్యాన్ని పొందాలని భావిస్తున్న అలీబాబా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మైక్రోమ్యాక్స్ మార్కెట్ విలువ ప్రకారం 20 శాతం వాటా నిమిత్తం 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7,200 కోట్లు) అలీబాబా చెల్లించాల్సి వుంటుంది. అమ్మకాల పరంగా ఇండియాలో రెండవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా ఉన్న మైక్రోమ్యాక్స్ విలువ 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 38 వేల కోట్లు) వరకూ ఉంటుందని అంచనా. సంస్థకు విలువ కట్టడంలో నిమగ్నమైన అధికారులు, అది పూర్తికాగానే ఏ మేరకు వాటాలు అలీబాబాకు అమ్మాలన్న విషయంలో తుది నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. అలీబాబాలో అతిపెద్ద ఇన్వెస్టర్ గా ఉన్న సాఫ్ట్ బ్యాంక్, ఈ విషయంలో కాస్తంత గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. సంస్థ విలువపై కచ్ఛితమైన గణాంకాలు లేకుండా ముందడుగు వద్దని సాఫ్ట్ బ్యాంక్ వారిస్తుండడంతోనే ఈ డీల్ ఆలస్యమవుతున్నట్టు తెలిసింది. మైక్రోమ్యాక్స్ తో డీల్ ద్వారా అపార అవకాశాలున్న భారత ఇంటర్నెట్ మార్కెట్లోకి ప్రవేశించాలన్నది అలీబాబా ప్రధాన ఉద్దేశమని సమాచారం.