: దిగొచ్చిన ఆర్టీసీ సంఘాలు... చర్చలు జరుపుదామని ఉపసంఘానికి వినతి
ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న కఠిన చర్యలతో ఇబ్బందుల్లో పడతామని భావించిన కార్మిక సంఘాలు దిగొచ్చాయి. ఒకవైపు సమ్మెను కొనసాగిస్తూ, పలు డిపోల వద్ద బస్సులను అడ్డుకుంటూనే, మరోవైపు ఉపసంఘంతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. సమస్యలపై మాట్లాడి మధ్యేమార్గంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే, తాము సమ్మెను తక్షణం విరమించి విధుల్లోకి చేరేందుకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడు చదలవాడ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వేసవి సెలవుల దృష్ట్యా రద్దీ ఎక్కువగా ఉన్నందున అన్ని డిపోల నుంచి తిరుపతికి బయలుదేరే బస్సు సర్వీసులను సమ్మె నుంచి మినహాయించాలని ఆయన కోరారు. దీనిపై తమ సభ్యులతో మాట్లాడి నిర్ణయం చెబుతామని యూనియన్ నేతలు వెల్లడించినట్టు తెలుస్తోంది.