: 'మిస్ కాల్' ప్రేమను నమ్మి మోసపోయిన యువతి!
ఒక మిస్ కాల్ ఆమె జీవితాన్నే మార్చేసింది. తన ఫోన్ కు వచ్చిన మిస్ కాల్ చూసి, తిరిగి కాల్ చేయగా, ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. స్నేహం ప్రేమగా మారి పెళ్లిపీటలెక్కకుండానే పెటాకులయింది. లేచిపోయిన కూతురు తమకు అక్కర్లేదంటూ తల్లిదండ్రులు తెగేసి చెబితే, అక్కున చేర్చుకునేవారు లేక చైల్డ్ హోంలో ఆశ్రయం పొందుతోందా యువతి. వివరాల్లోకి వెళితే, చిత్తూరు జిల్లా పోలేపల్లి మండలానికి చెందిన 19 సంవత్సరాల యువతికి ఫోన్ లో గొల్లపల్లె గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. గత నెలలో ఇద్దరూ కలుసుకున్నారు. పెళ్లి చేసుకుందామని ప్రేమ్ చెప్పగా, ఆ యువతి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. పలమనేరులో 20 రోజుల సహజీవనం అనంతరం ఉద్యోగం కోసం వెళ్తున్నానని చెప్పి ప్రేమ్ వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే ఇంటికి వెళ్లిపొమ్మని ఉచిత సలహా ఇచ్చాడు. తమను కాదని వెళ్లిన అమ్మాయి తమకు అక్కర్లేదని, ఇంటికి రానక్కర్లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఐసీడీఎస్ అధికారులకు విషయం తెలిపి మదనపల్లి చైల్డ్ హోంకు యువతిని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.