: జైలా...? బెయిలా...?: నేడు తేలనున్న సల్మాన్ భవితవ్యం!
మద్యం మత్తులో పేవ్ మెంట్లపై నిద్రిస్తున్న వారిపైకి కారును ఎక్కించిన హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భవితవ్యం నేడు తేలనుంది. ఇప్పటికే ఈ కేసులో నమోదైన ఎనిమిది అభియోగాల్లోనూ సల్మాన్ ను దోషిగా తేల్చిన ముంబై సెషన్స్ కోర్టు, ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. అయితే వెనువెంటనే బొంబాయి హైకోర్టులో బెయిల్ దాఖలు చేసుకున్న సల్మాన్ రెండు రోజుల పాటు ఉపశమనం పొందాడు. అయితే ఈ బెయిల్ గడువు నేటితో ముగియనుంది. మొన్న తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, సాధారణ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టనుంది. బెయిల్ లభిస్తే, సల్మాన్ జైలు ఊచలు లెక్కించాల్సిన అవసరం ఉండదు. అయితే అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సల్మాన్ కు బెయిల్ మంజూరులో బొంబాయి హైకోర్టు అంత తొందరగా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. హైకోర్టులో బెయిల్ రాని పక్షంలో వెనువెంటనే సల్మాన్ సెషన్స్ కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు సల్మాన్ ను పోలీసులు జైలుకు తరలిస్తారు. మరి సల్మాన్ జైలుకెళతాడా? కోర్టు నుంచి ఉపశమనం లభిస్తుందా? అన్న అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.