: నిమిషం ఆలస్యమైనా అనుమతించరట... రవాణా సౌకర్యం అందకపోతే ఎలా?
ఏపీలో ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష నేడు జరగనుంది. ఉదయం (10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా) ఇంజినీరింగ్ విభాగానికి, మధ్యాహ్నం (2.30 గంటల నుంచి 5.30 గంటల దాకా) మెడిసిన్ విభాగం విద్యార్థులకు పరీక్ష జరగనుంది. దాదాపు 2.55 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అయితే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేశామని ఏపీ సర్కారు చెబుతోంది. ఇదిలా ఉంటే, ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎంసెట్ పరీక్షకు విద్యార్థులను అనుమతించడం లేదు. ఈ ఏడాది కూడా ఈ నిబంధనను పక్కాగా అమలు చేసి తీరతామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిన నేపథ్యంలో ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు చెందిన వాహనాలు విద్యార్థులకు ఎంతమేరకు సేవలందిస్తాయన్న విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల్లో రవాణాకు సంబంధించి తక్షణమే స్పందించేందుకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. అత్యవసరంగా రవాణా సదుపాయం కావాల్సిన విద్యార్థులు 100కు ఫోన్ చేస్తే తక్షణమే వాహనాలను అందుబాటులో ఉంచుతామని పోలీసులు చెబుతున్నారు. ఇక గుంటూరు జిల్లాలో మాత్రం ఎంసెట్ పరీక్ష నేపథ్యంలో ఈ ఒక్కరోజు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధపడ్డారు. సమ్మె కొనసాగిస్తూనే ఈ ఒక్కరోజు సేవలందిస్తామని వారు పేర్కొంటున్నారు. ఇన్ని అవాంతరాలు, అనుమానాల నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో పడిపోయారు. మరి పరీక్షలు ఎలా రాస్తారో చూడాలి!