: కాశ్మీర్ లో కాంట్రాక్టు కార్మికుల ధర్నాపై పోలీసు జులుం
జమ్మూ కాశ్మీర్ లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ సారి కాల్పులు జరిపింది ఉగ్రవాదులు కాదు, పోలీసులు. సంఘ విద్రోహశక్తులపై కాక న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టిన కాంట్రాక్టు కార్మికులపై పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. రాష్ట్ర రాజధాని శ్రీనగర్ లో కాంట్రాక్టు కార్మికుల ధర్నాపై పోలీసులు జులుం ప్రదర్శించారు. సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని ధర్నాకు దిగిన కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. తొలుత వాటర్ కేనన్లు ప్రయోగించిన పోలీసులు ఆ తర్వాత భాష్ప వాయు గోళాలను ప్రయోగించారు. అప్పటికీ వెనక్కు తగ్గని కార్మికులపై పోలీసులు కాల్పులకూ తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల కాల్పుల్లో పలువురు కాంట్రాక్టు కార్మికులకు గాయాలైనట్లు సమాచారం. పోలీసుల కాల్పులతో పరుగులు పెట్టిన కార్మికుల్లో కొందరిని పట్టుకున్న పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.