: స్టాక్ మార్కెట్లో ఆనాటి ఆనందం నేడెక్కడ?


మే 2014... దేశంలో ఓ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని, నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వస్తుందని సర్వేలు చెబుతున్న వేళ, స్పష్టమైన మెజారిటీతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడి భారత భవిష్యత్తుపై అంచనాలను ఆకాశానికి పెంచింది. స్టాక్ మార్కెట్లు ఆల్ టైం రికార్డులకు దూసుకెళ్లాయి. కొత్త పెట్టుబడులు పెడతామంటూ విదేశీ సంస్థలు ముందుకొచ్చాయి. మోదీ సైతం ఇన్వెస్ట్ మెంట్స్ కోసం కాళ్లరిగేలా దేశదేశాలు తిరిగారు. ఒక సంవత్సరం గడిచింది. మార్కెట్ వర్గాలు పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. కీలక సంస్కరణల అమలులో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైంది. వడ్డీ రేట్లను తగ్గిస్తుందనుకున్న ఆర్బీఐ ఆ దిశగా సఫలీకృతం కాలేకపోయింది. కనీస ప్రత్యామ్నాయ పన్ను, జీఎస్టీకి ఆమోదం వంటి విషయాల్లో మోదీ సర్కారు విజయం సాధించలేకపోయింది. ఇదే సమయంలో ద్రవ్యలోటు ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ హరించుకుపోయింది. సంవత్సరం క్రితం ఉన్న ఉత్సాహం ఇప్పుడు భారత పారిశ్రామిక వర్గాల్లో కనిపించడం లేదు. ఫలితంగా స్టాక్ మార్కెట్ పునాదులు కదులుతున్నాయి. ముఖ్యంగా గత సంవత్సరం మే నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకూ భారత స్టాక్ మార్కెట్ కు వెన్నుదన్నుగా నిలిచిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ వాటాలమ్ముకుంటున్నారు. ఇండియన్ స్టాక్స్ చరిత్రలో 2014 సంవత్సరం అత్యుత్తమ పనితీరును కనబరచగా, 2015 వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ఎంతగా అంటే, అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు స్పందించడం లేదు. క్షేత్రస్థాయిలో మార్పు కనిపించక పోవడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలు తీసుకోవడంలో కేంద్రం వైఫల్యానికి తోడు, కార్పొరేట్ సంస్థల ఆర్థిక గణాంకాలు అసంతృప్తిగా ఉండడం మార్కెట్ కు వ్యతిరేకాంశాలుగా మారాయి. ఈ సంవత్సర కాలంలో ఆర్బీఐ గవర్నర్ రెండుసార్లు స్వల్పంగా వడ్డీ రేట్లు తగ్గించగా, ఆ లాభాన్ని ఖాతాదారులకు అందించేందుకు బ్యాంకులు నిరాకరించాయి. బ్యాంకుల పనితీరు అంతంతమాత్రంగా ఉండడం, నిరర్థక ఆస్తుల మొత్తం ప్రమాదకర స్థాయికి పెరగడం వంటి కారణాలతో బ్యాంకులు తామిచ్చిన రుణాలపై వడ్డీని తగ్గించేందుకు వెనుకంజ వేస్తున్నాయి. ఇక అంతర్జాతీయంగా తగ్గుతున్న ముడి చమురు ధరల ప్రభావమూ ఇన్వెస్టర్ల ఆనందాన్ని హరించివేస్తోంది. అత్యధికంగా చమురును ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన యమన్ లో అస్థిరత, అక్కడ జరుగుతున్న యుద్ధం తదితరాలు పెట్టుబడులను దూరం చేస్తున్నాయి. ఈ కారణాలన్నింటితో గత నెల 9వ తేదీన 29 వేల పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ ఇప్పుడు 26,600 పాయింట్లకు పడిపోయింది. నెల రోజుల్లో 3 వేల పాయింట్లు పడిపోయిన ప్రస్తుత తరుణంలో కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లో ఈక్విటీలు కొనుగోలు చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్ స్థిరపడిన తరువాతే మార్కెట్లోకి ప్రవేశించాలని సలహా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News