: దావూద్ ఆచూకీపై కేంద్రం పిల్లిమొగ్గలు... విమర్శలతో యూటర్న్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీపై నరేంద్ర మోదీ సర్కారు నిన్న పిల్లిమొగ్గలేసింది. పాకిస్థాన్ లోని కరాచీలో అతడు తలదాచుకున్నాడంటూ ఇదివరకే పలుమార్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఇటీవల దావూద్ తన వ్యాపార సహచరులతో ఫోన్ లో మాట్లాడిన సంభాషణల టేపులు కూడా వెలుగుచూశాయి. ఈ టేపుల్లోనూ అతడు కరాచీలోనే ఉన్నట్లు స్పష్టమైంది. ఈ క్రమంలో నిన్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడన్న విషయంపై తమ వద్ద సమాచారం లేదని ప్రకటించారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దీంతో తేరుకున్న రిజిజూ, దావూద్ పాక్ లోనే ఉన్నాడని మాట మార్చారు. అంతేకాక త్వరలో అతడిని కటకటాల వెనక్కి పంపిస్తామని కూడా ఆయన ప్రకటించారు.