: రోడ్లున్నది కార్లు, కుక్కల కోసమే...జనం పడుకోవడానికి కాదు: సల్మాన్ మిత్రుల అనుచిత ట్వీట్స్


మద్యం మత్తు తలకెక్కిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణంతో పాటు నలుగురి గాయాలకు కారణమయ్యాడు. 13 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు సల్మాన్ చేయని యత్నం అంటూ లేదు. అయితే అతడి పన్నాగాన్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అతడికి దిమ్మతిరిగే తీర్పిచ్చారు. సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ నిన్న వెలువడిన కోర్టు తీర్పుపై భిన్న స్వరాలు వినిపించాయి. సల్మాన్ మిత్రులు అభిజీత్ భట్టాచార్య, ఫరాఖాన్ అలీలు ట్విట్టర్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘రోడ్లున్నది కార్లు, కుక్కలు తిరగడానికే తప్ప... జనం నిద్ర పోవడానికి కాదు. రోడ్లపై కుక్కలు నిద్రిస్తే, అవి కుక్కచావు చస్తాయి. రోడ్లు పేదల అబ్బ సొత్తు కాదు’’ అని వివాదాస్పద ట్వీట్లు చేశారు. మరికొన్ని ట్వీట్లు ఇలా ఉన్నాయి. ‘‘కొన్నాళ్లపాటు నాకు ఎక్కడా చోటు దొరకలేదు. అయినా నేనేం రోడ్ల మీద పడుకోలేదు’’, ‘‘రైల్వే ట్రాక్ దాటుతూ రైలు ఢీకొని ఒకరు మరణిస్తే, ట్రైన్ డ్రైవర్ కు శిక్ష వేయడం లాంటిదే ఇదీ. రోడ్డుపైనా, ఫుట్ పాత్ పైనా ఎవరూ పడుకోకూడదు. అది కూడా రైల్వే ట్రాక్ ను దాటినంత ప్రమాదమే’’, ‘‘ఆత్మహత్య నేరం. రోడ్ల మీద పడుకోవడం కూడా అంతే నేరం. చిత్ర పరిశ్రమలో 80 శాతానికి ఇళ్లుండవు. అయినా వాళ్లు కష్టపడి స్టార్ డమ్ సంపాదిస్తారు. కానీ ఎప్పుడూ ఫుట్ పాత్ పై పడుకోరు’’ అని వారిద్దరూ ట్విట్టర్ లో చెలరేగిపోయారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.

  • Loading...

More Telugu News