: 'శతక'బాదిన గేల్... 138 పరుగుల తేడాతో పంజాబ్ చిత్తు
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున ఆడుతున్న అతడు, ఐపీఎల్ లో మరో సెంచరీ సాధించాడు. కేవలం 57 బంతుల్లోనే అతడు 117 పరుగులు సాధించాడు. ఏడు ఫోర్లు, 12 సిక్స్ లతో వీరవిహారం చేసిన గేల్, బౌండరీల ద్వారానే వంద పరుగులు రాబట్టడం గమనార్హం. గేల్ దూకుడుకు డివిలియర్స్(47) మెరుపు ఇన్నింగ్స్ జతకలవడంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత 227 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, భారీ లక్ష్యం ముందు చతికిలబడిపోయింది. కనీస స్థాయిలోనూ పోరాట పటిమ కనబరచని ఆ జట్టు 138 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. వెరసి ఈ సీజన్ లో ప్లే ఆఫ్ నుంచి ఔటైన తొలి జట్టు చెత్త రికార్డును నమోదు చేసుకుంది. అక్షర్ పటేల్ (40) మినహా జట్టులో ఏ ఒక్కరు కూడా కనీస స్థాయి ఆటతీరును కూడా కనబరచలేదు. దీంతో 13.4 ఓవర్లలోనే 88 పరుగులకు ఆ జట్టు ఆలౌటైంది.