: కిరణ్ కు సీఎం పోస్టుపై రాహుల్ అంతర్మథనం... తప్పుడు నిర్ణయమేనని ఒప్పుకోలు
ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నియమితులు కావడంలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీనే కీలక భూమిక పోషించారు. అయితే రాష్ట్ర నేతల సలహాలను పెడచెవినపెట్టి తీసుకున్న నాటి తన నిర్ణయం పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిందని ప్రస్తుతం రాహుల్ అంతర్మథనంలో పడ్డారు. ఇటీవల తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు రాహుల్ ను కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ ‘‘నాడు నేను తీసుకున్న నిర్ణయం తప్పే. పార్టీని కోలుకోలేని దెబ్బ తీస్తుందనుకోలేదు. మళ్లీ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎన్నేళ్లు పడుతుందో!’’ అని వ్యాఖ్యానించారట. కిరణ్ ను సీఎంగా నియమించిన తర్వాతైనా పార్టీ నేతల సూచన మేరకు ఆయనను ఆ పదవి నుంచి తప్పించి ఉన్నా, పార్టీకి కొంతలో కొంతైనా మేలు జరిగేదని కూడా రాహుల్ అన్నారని సమాచారం. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలై, ఏడాది గడిచిన తర్వాత కాని నాటి తన నిర్ణయం ఎంత తప్పో రాహుల్ కు తెలిసిరావడం గమనార్హం.