: 'టెక్సాస్' హతుడు అమ్మాయిల కలల రాకుమారుడట!
టెక్సాస్ లో ఆర్ట్ ఫెయిర్ పై దాడిచేసిన ఇద్దరిలో నాదిర్ సూఫీ ఒకడు. ఇతగాడు ఓ పాకిస్థానీ సంతతి వ్యక్తి. పోలీసుల ఎదురు కాల్పుల్లో హతమయ్యాక, ఇతడి గురించి పాకిస్థాన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. అతడితో కలిసి చదువుకున్నవారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సూఫీ విద్యార్థిగా ఉన్నప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అని ఇస్లామాబాద్ లోని ఇంటర్నేషన్ స్కూల్ లో అతడితో పాటు చదువుకున్న వ్యక్తులు తెలిపారు. సూఫీ అంటే అమ్మాయిలు పడిచచ్చిపోయేవారని, అతడిలో ఏదో ఉందని తాము అనుకునేవాళ్లమని ఓ సహాధ్యాయి వెల్లడించాడు. అప్పట్లో మామూలుగానే ఉండేవాడని, అతివాద ధోరణలు మచ్చుకైనా కనిపించేవి కావని అన్నాడు. సూఫీ చాలా సరదా వ్యక్తి అని, గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికా వెళ్లిపోయాడని, మంచి భవిష్యత్తు ఉందని భావించామని తెలిపాడు. ఎల్విస్ ప్రెస్లీలా ఓ పాట పాడిన తర్వాత, స్కూల్లో మిస్టర్ ఎల్విస్ ప్రెస్లీ అయిపోయాడని, ఆకర్షణీయమైన హెయిర్ స్టయిల్ తో ఆకట్టుకునేలా ఉండేవాడని ఓ యువతి వివరించింది. కానీ, టెక్సాస్ లో సూఫీ చర్యకు షాక్ కు గురయ్యానని తెలిపింది. కాగా, సూఫీ తల్లిదండ్రులు పాక్ లో ఉండగానే విడిపోయారు. తల్లితో కలిసి అతడు అమెరికా చేరుకున్నాడు.